అనగనగా ఒక ఊరిలో ఓ అమాయక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు యజ్ఞం లో భాగంగా బలివ్వడానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వెళ్తుంటే ముగ్గురు దొంగలు చూసారు. ఆ మేకను ఎలాగైన దక్కించుకోవాలనుకున్నారు. ముగ్గురూ కలిసి ఒక పథకం పన్నారు. ఆ బ్రాహ్మడికి కనిపించకుండా ముగ్గురూ మూడు చోట్లకెళ్లి నిలబడ్డారు.
అనుకున్న పథకం ప్రకారం, మొదటి దొంగ బ్రాహ్మణుడికి ఎదురొచ్చి “అయ్యా , ఈ కుక్కను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?” అని అడిగాడు. బ్రాహ్మణుడు “మూర్ఖుడా! ఇది కుక్క కాదు, మేక!” అని జవాబిచ్చాడు. “మేకను పట్టుకుని కుక్కంటాడేమిటబ్బా” అని ఆలోచిస్తూ తన దారిన కొనసాగాడు.
కొంత దూరం వెళ్లిన తరువాత, రెండో దొంగ ఎదురుగా వచ్చి చాలా వినయమున్నట్టు నమస్కరించాడు. “ఓ బ్రాహ్మణా! ఎందుకు కుక్కను మోస్తున్నారు?” అనడిగాడు. బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్య పోయాడు. మేకను భుజాల మీదినుంచి దించి చూసుకున్నాడు. “ఇది కుక్క కాదు, మేకనే. వీళ్ళిద్దరూ కుక్కంటున్నారేమిటి?” అని దీర్ఘాలోచనలో పడ్డాడు. అలా ఆలోచిస్తూ మేకను మళ్ళీ తన భుజాల మీదకు ఎక్కించుకుని తన దారిన నడవడం మొదలుపెట్టాడు.
కొంచెం దూరమెళ్ళాక మూడో దొంగ ఎదురయ్యి, “అపచారం! అపచారం! ఒక బ్రాహ్మణుడివి అయి ఉండి నీచంగా ఈ కుక్కను మీరు మోయడమేమిటి?” అని అన్నాడు. ఇంత మంది చెపుతున్నారంటే అది మేక కాదు కుక్కే అయివుంటుందనుకుని ఆ బ్రాహ్మణుడు వెంటనే మేకను పక్కన పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటి వైపుకు పరుగు తీసాడు.
ఆ ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను సొంతం చేసుకున్నారు.

0 comments: