Images Source: GOOGLE | Any copyright violations are completely unintentional. Credits given to the concerned person/organization wherever possible. Let us know any such voilation/using without credit. Thanks!

దేశ భాషలందు తెలుగు లెస్స!

Crafted with on Telugu by Kathala Express teamⒸ2017
    జానకీపురం జమీందారు జనప్రియ వర్మ కు కొంతకాలంగా చిత్రమైన వ్యాధి పట్టుకుంది. హంసతూలికా తల్పం మీద ఎంత పొర్లినా నిద్ర పట్టక బాధపడసాగాడు. ఆస్థాన వైద్యుడు ఎన్ని మందులు ఇచ్చినా ఉపయోగం కనిపించలేదు. జమీ వ్యవహారాలు చూడను కూడా ఓపికలేక బాధపడ సాగాడు జమీందారు. జమీందారి భార్యకు భయం పట్టుకుంది. ఆమె దివానును పిలిపించి కుల గురువైన వల్లభాచార్యులకు వివరంగా లేఖ రాసి పంపమని కోరింది. వార్తాహరుడు తెచ్చిన ఆలేఖ చదివి వల్లభాచార్యులు బదులు రాసి ఇచ్చి పంపారు. ఆ లేఖాంశాలు విని జనప్రియ వర్మ ఆ మరునాడే దివానుతో కలిసి గురుకులానికి బయలేేరాడు.

     వల్లభాచార్యులు సూచించిన విధంగానే ప్రాతఃకాలంలోనే అంతఃపురం నుంచి కాలినడకన కులదెైవమైన సూర్యదేవాలయం చేరి, ఆ భవనాశిలో స్నానమాచరించి, దేవుని అర్చించి గర్భాలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి, ప్రసాదం స్వీకరించి, ఆలయం నుంచి గుఱ్ఱపు బగ్గీలో ప్రయాణం సాగించాడు. మధ్యాహ్నానికి మాదిరాజపురం చేరాక అక్కడి పూటకుళ్లమ్మ ఇంట్లో నేలపైకూర్చుని అరిటాకులో వేడివేడి జొన్న సంగటిలో, కొరివికారంలో  ఉల్లినంచుకుంటూ తిని, అల్లం, కరివేప, కొత్తిమీర వేసిన జారు పెరుగుతో భోజనం చేసి, అక్కడినుంచి గుఱ్ఱపు స్వారీ చేస్తూ సాయం కాలానికి సోమేశ్వరాలయం చేరారు. అది ఎంతో  పురాతన దేవాలయం, ఆ స్వామిని దర్శిస్తే శారీరక, మానసిక కష్టాలు తీరుతాయనీ ,ఆరోగ్యం కుదుటబడుతుందని ప్రజల విశ్వాసం. 101 మెట్లు ఎక్కి కొండ పైభాగాన ఉన్న స్వామిని దర్శించి, ప్రసాదం స్వీకరించి, అక్కడి చల్లని వృక్షాల కింద కొంత సమయం కూర్చుని, కొండదిగి కాలినడకన ప్రయాణం సాగించి సూర్యాస్తమయం అయ్యాక వల్లభాచార్యుల వారి గురుకులాశ్రమం చేరారు.  వల్లభాచార్యులు  జమీందారుని సగౌరవంగా ఆహ్వానించి, వేడినీరు స్నానానికి ఏర్పాటు చేసాడు. అనంతరం కమ్మని వేడివేడి భోజనం ఆకుకూర, రసం, మజ్జిగతో పెట్టించి విశ్రాంతి తీసుకోమని పడక ఏర్పాటు చేసాడు. ఒక తుంగ చాపమీద, పాత పంచ పరిచి ఉండగా జమీందారు పవళించగానే నిద్రలో మునిగిపోయాడు. ఆ గురుకులంలోనే తాను పూర్వం విద్యనభ్యసించడం వలన ఆ ప్రాంతమంతా సుపరిచితం. మరునాడు ప్రాతః కాలంలోనే ఆచార్యుల వెంట రెండు మైళ్ళ దూరంలో నదీస్నానం చేసివచ్చి ఆచార్యునితో పాటుగా పూజాదికార్యక్రమాలలో పాల్గొని, శిష్యులతో పాటు కూర్చుని కమ్మని ఫలాలు, వేడిపాలు సేవించాడు. ఆ తరువాత ఆచార్యులు, శిష్యులు అంతా కలిసి పూల మొక్కలు, కూరలపాదులు, ఫలవృక్షాలకు నీరు, ఎరువు పెట్టి, ఎండి పోయిన కొమ్మలు, ఆకులు తొలగించి వచ్చి విద్యాభ్యాసంలో మునిగారు. దివానుతో కలిసి తమ ఆశ్రమం చుట్టూ ఉన్న ప్రాంతాలను దర్శించి రమ్మని జనప్రియ వర్మకు ఆచార్యులు. మిట్టమధ్యాహ్నం వరకూ ప్రకృతిని దర్శించి వచ్చి,  వేడివేడి సాత్విక భోజనం చేసాక, ఆశ్రమంలోని ఉసిరి, వేప వృక్షాల కింద ఆచార్యులతో పాటుగా కూర్చుని ముచ్చటించి, సాయంకాలం తిరిగి నడిచి నదీస్నానమాచరించి వచ్చి, ధ్యానాదులలో పాల్గొని, భుజించి పడకచేరగానే క్రమంగా నిద్రలోకి జారుకున్నాడు  జనప్రియ వర్మ. ప్రాతఃకాలానికి అతడికి శరీరమూ, మనసూ హాయిగా ఉన్నాయి.

     ఆమరునాడు నదీస్నానానికి వెళ్ళేటపుడు జనప్రియ వర్మ ఆశ్చర్యంతో, "ఆచార్యా! ఇంత హాయిగా నిద్రించి ఎంత కాలమైందో! మీరేదో మంత్రం పఠించి నాకు నిద్రను ప్రసాదించారు" అన్నాడు. బదులుగా ఆచార్యులు "కుమారా! ఏ మంత్రతంత్రాలూ లేవునాయనా! తిన్నదానికి తగిన శరీర శ్రమ చేయడమే ఆ మంత్రం. మన శరీర ‘మర’ కు పని కల్పించకపోతే తుప్పుపట్టడం ఖాయం. నీవు నీ జమీ గ్రామాల్లో జమీందారుగా కాక మారు వేషంలో సాధారణ పౌరునిగా సంచరించు. పేదప్రజల కష్టసుఖాలు పరిశీలించు. రైతుల ఇబ్బందులు గ్రహించు. ఉద్యోగుల నివేదికలుకాక నీ మనసు నివేదికతో పని సాగించు. సాత్వికాహారం మాత్రమే భుజించు, చూడూ 35 ఏళ్లకే నీ శరీరం, పొట్ట పెరిగిపోయాయి. ఈ మూడు రోజుల్లోనే నీలో మంచి మార్పు శారీరకంగానూ వచ్చింది.  ప్రాతఃకాలంలో లోకబాధవుని వెచ్చని కిరణాలలో ఉద్యోగులతో జమీ విశేషాలు ముచ్చటిస్తూ నడక సాగించు. ఇక్కడ జీవించిన విధంగా నీ జీవనసరళిని మార్చుకో. కమ్మని నేయి, చిక్కనిపాలూ, పెరుగు, వెన్న, మాంసాహార భోజనం, శ్రమ లేకుండా కూర్చోడం ఇవన్నీ నీ శారీరక, మానసిక పరిస్థితులపై ప్రభావం చూపాయి. అంతేనాయనా! వెళ్ళిరా! పదికాలాల పాటు జనరంజకంగా పాలించు" అంటూ ఆశీర్వదించి పంపారు ఆచార్యులు.

story from the book - బాల నీతి కథలు
   
   పూర్వం పల్లవ రాజ్యాన్ని పవిత్ర వర్మ అనే రాజు పాలించేవాడు. అతడికి లేకలేక ఒక కుమారుడు కలిగాడు. అతని భార్య భామతి బిడ్డను అపురూపంగా చూసుకునేది. ఆ బిడ్డకు అపూర్వ వర్మ అనే పేరు పెట్టుకున్నారు దంపతులు. అపూర్వ వర్మకు ఐదేళ్ళు నిండుతుండగా అతడిని తమ కులగురువైన జ్ఞానానందుని గురుకులంలో విద్యాభ్యాసం కోసం చేరాాలని నిర్ణయించుకున్నాడు పవిత్రవర్మ. ఆ మరునాడే శుభదినమని గురువు చెప్పాక మహారాణికి విషయం చెప్పాడు పవిత్రవర్మ.

  వెంటనే మహారాణి భామతి, "మహారాజా! కుమారుని గురుకులానికి పంపేబదులుగా గురువుగారినే అంతః పురానికి పిలిపించి విద్యాభ్యాసం చేయించవచ్చు కదా! కుమారుని వదిలి నేను జీవించలేను మహారాజా!" అనింది. "మహారాణీ! మన సాంప్రదాయం ప్రకారం గురుకులంలోనే ఇతర విద్యార్థులతో కలిసి జీవిస్తూ విద్యాభ్యాసం చేయాలి. దాన్ని మార్చడం శ్రేయస్కరం కాదు. కుమారుని భవిత గురించి ఆలోచించి మీరు కుమారుని వదలి కొంతకాలం జీవించకతప్పదు. రాజ్యోచిత విద్యలన్నీ ఆశ్రమంలో నేర్పడం ఆనవాయితీ" అని బదులిచ్చాడు. ఆరాత్రి అపూర్వ వర్మకు అన్నం తినిపిస్తూ భామతి "ఈ కాస్తా తిను కుమారా! బంగారం కదూ!" అంటూ బ్రతిమాలడం చూసిన పవిత్ర వర్మ 'ఇంతగారాబం చేయడం కుమారునికి మంచిదికాదు’ అని భావించాడు. మహారాణి కుమారునితో "కుమారా! ఆశ్రమంలో నీకు ఆకలైతే గురుపత్నికి విన్నవించు. ఆకలితో ఉండకు కుమారా!" అనిచెప్పగా, దానికి అపూర్వ వర్మ "ఆకలంటే ఏమిటి మాతా!" అని అడిగాడు. అది విని మహరాజు మనసులో ఒక నిర్ణయానికి వచ్చాడు. మరుదినం అపూర్వ వర్మ ను తీసుకుని గురుకులానికి బయలుదేరాడు పవిత్ర వర్మ. కుమారుని గురువుకు అప్పగించి, అతడికి ఏదో రహస్యంగా విన్నవించుకుని వచ్చాడు.

   గురుకులంలో అందరితో పాటుగా అపూర్వ వర్మ కూడా వేకువనే లేచి గంగా స్నానం ఆచరించి, యోగవిద్యలు గురువు చేస్తుండగా అనుసరించి, పక్కనే ఉన్న అడవినుంచి పూలూ, ఫలాలూ సేకరించి తెచ్చాక, గురుపత్ని అందించే గోక్షీరం , పండ్లు సేవించి, మధ్యాహ్నం వరకూ విద్యాభ్యాసం చేయాల్సి వచ్చేది. ఏదో తెలీని బాధ అతడి కడుపులో కలగ సాగింది. ఒక మధ్యాహ్నం అతడు పొట్టపట్టుకుని బాధ పడుతుండగా చూసిన తోటివిద్యార్థులు వెళ్లి గురువు గారిని పిలుచుకువచ్చారు. గురువు జ్ఞానానందులు వచ్చి అపూర్వని పరీక్షించి, చిరునవ్వుతో, "కుమారా! ఇదే ఆకలంటే ! ఆకలైనపుడు కడుపులో ఇలాంటి బాధ కలుగుతుంది. దేశంలో ఎందరో పేదలు ఈ ఆకలి తీర్చుకోడానికి అనేక కష్టాలు పడుతుంటారు. చేద్దామన్నా తగినపని దొరకక, లభ్యమైనది చేయలేక ఇబ్బంది పడుతుంటారు నాయనా! ప్రజల పేదరికాన్ని పోగొట్టి వారి ఆకలితీరడానికి  తగిన చర్యలు చేపట్టి, వారిని ఆదుకోవడం రాజు కర్తవ్యం."అని చెప్పి అతడి ఆకలి తీర్చాడు. అలా ప్రతి విషయం చలి, ఎండ, వానల నుంచి రక్షణ, నివాసం, నీటి అవసరం, శరీరానికి వస్త్రాలు మొదలైనవన్నీ అనుభవపూర్వకంగా నేర్పారు. యుద్ధవిద్యలతో పాటుగా, యుద్ధనీతి, రాజనీతి, రాజు విధులు, కర్తవ్యం కూడా నూరిపోశారు గురువుగారు.

     యువరాజు సుశిక్షితుడైన పాలకునిగా తయారయ్యాక అతడిని రాజభవనానికి పంపారు జ్ఞానానందులు. యువరాజు అపూర్వునికి తండ్రి పవిత్ర వర్మ తనకు వయస్సు పైబడటంతో రాజ్యాభిషేకం చేశాడు. అపూర్వుడు ప్రజల అవసరాలు తీర్చడానికి తగిన పనులు కల్పించి వారికి వారే తమకు కావల్సిన ధనం సంపాదించుకునే లాగా తీర్చిదిద్దాడు. గొప్ప పాలకుడని పేరుపొందాడు.
నువ్వు లోకాన్ని లోపలి తీసుకుంటున్నపుడు
అది నిన్నూ లోపలికి తీసుకుంటుంది
నిశ్చలతటంలోకి దిగినట్టు లోకంలోకి దిగుతావు కానీ
నీటి అడుగున వేచిఉన్న మొసళ్ళని ఊహించలేవు

ప్రతి గెలుపూ, పరాజయమూ
జీవనానందం నుండి మరికాస్త దూరం చెయ్యటానికి వస్తాయి
కీర్తి ఒక వజ్రంలా ఆకర్షిస్తుంది కానీ
దానిని మ్రింగినపుడు ప్రాణం తీయటం మొదలుపెడుతుంది

జీవితం ఇటువంటిదని ఎవరూ చెప్పరు
జీవితం కానిది వదులుకొంటే జీవితమే మిగులుతుంది
వెళ్లిపొమ్మని నిన్ను ఊపేస్తున్న భావాలన్నీ
జీవితపు నీడలే కానీ, జీవితం కాదు

జీవితం తనని తాను చూసుకొనేందుకు
నిన్ను కన్నది కానీ, నువ్వేదో చేసి తీరాలని కాదు
ఏదో చెయ్యటానికే అన్నీ ఉండాలనుకుంటే
ఏదీ చెయ్యని ఆకాశం ఏనాడో మాయమైపోయేది

జీవించడం అంటే మరేం కాదు
గాలిలా, నేలలా, నీటిలా ఊరికే ఉండడం
ఉండడమే ఉత్సవమైనట్టు ఉండడం
మిగిలిన పనులన్నీ నిద్రపోయాక నీ ప్రక్కలో ఒంటరైన ఆటబొమ్మలు

రచన: బివివి ప్రసాద్ 
     
     అనగనగా ఒక ఊరిలో ఓ అమాయక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు యజ్ఞం లో భాగంగా బలివ్వడానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వెళ్తుంటే ముగ్గురు దొంగలు చూసారు. ఆ మేకను ఎలాగైన దక్కించుకోవాలనుకున్నారు. ముగ్గురూ కలిసి ఒక పథకం పన్నారు. ఆ బ్రాహ్మడికి కనిపించకుండా ముగ్గురూ మూడు చోట్లకెళ్లి నిలబడ్డారు.
     అనుకున్న పథకం ప్రకారం, మొదటి దొంగ బ్రాహ్మణుడికి ఎదురొచ్చి “అయ్యా , ఈ కుక్కను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?” అని అడిగాడు. బ్రాహ్మణుడు మూర్ఖుడా! ఇది కుక్క కాదు, మేక!” అని జవాబిచ్చాడు. “మేకను పట్టుకుని కుక్కంటాడేమిటబ్బా” అని ఆలోచిస్తూ తన దారిన కొనసాగాడు.
     కొంత దూరం వెళ్లిన తరువాత, రెండో దొంగ ఎదురుగా వచ్చి చాలా వినయమున్నట్టు నమస్కరించాడు. “ఓ బ్రాహ్మణా! ఎందుకు కుక్కను మోస్తున్నారు?” అనడిగాడు. బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్య పోయాడు. మేకను భుజాల మీదినుంచి దించి చూసుకున్నాడు. “ఇది కుక్క కాదు, మేకనే. వీళ్ళిద్దరూ కుక్కంటున్నారేమిటి?” అని దీర్ఘాలోచనలో పడ్డాడు. అలా  ఆలోచిస్తూ మేకను మళ్ళీ  తన భుజాల మీదకు ఎక్కించుకుని తన దారిన నడవడం మొదలుపెట్టాడు.
     కొంచెం దూరమెళ్ళాక మూడో దొంగ ఎదురయ్యి, “అపచారం! అపచారం! ఒక బ్రాహ్మణుడివి అయి ఉండి నీచంగా ఈ  కుక్కను మీరు మోయడమేమిటి?” అని అన్నాడు. ఇంత మంది చెపుతున్నారంటే అది మేక కాదు కుక్కే అయివుంటుందనుకుని ఆ బ్రాహ్మణుడు వెంటనే మేకను పక్కన పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటి వైపుకు పరుగు తీసాడు.
     ఆ ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను సొంతం చేసుకున్నారు.
   
     ఒక రోజు అక్బర్, బీర్బల్ వేటకి వెళ్ళారు. అడవి లో చాలా కాకులు కనిపించాయి. ఆ కాకులను చూసి అక్బర్ మహారాజుకి ఒక ఆలోచన వచ్చింది. సరదాగా బీర్బల్ తెలివిని పరీక్షించాలనుకున్నాడు. వెంటనే తన పక్కన వున్న బీర్బల్ వైపుకు తిరిగి, “బీర్బల్, మన రాజ్యంలో ఎన్ని కాకులు వున్నాయి?” అని అడిగాడు.
    బీర్బల్ వెంటనే చాకచక్యంగా “సామ్రాట్, మన రాజ్యంలో సరిగ్గా తొంభై తొమ్మిది వేల, ఆరు వందల నలభై మూడు కాకులు వున్నాయి” అని బదులు చెప్పాడు. ఆశ్చర్యపోయిన అక్బర్ మహారాజు, ఇలా అడిగారు. 
అక్బర్: అంత కచ్చితంగా చెబుతున్నావు, అంతకన్నా ఎక్కువ కాకులుంటే?
బీర్బల్: అయితే పక్క రాజ్యాలనుంచి మన రాజ్యంలోని కాకుల చుట్టాలు వచ్చినట్టు! 
అక్బర్: ఒక వేళ తక్కువ వుంటే?
బీర్బల్: అయితే మన రాజ్యం కాకులు వాళ్ళ చుట్టాలని కలవడానికి వెళ్ళినట్టూ! అన్నాడు 😃
  ఎన్ని కాకులున్నాయో ఎవరికైనా ఎలా తెలుస్తుంది అని చెప్పకనే అక్బర్ మహారాజు కి అర్థమయ్యేలా చెప్పాడు బీర్బల్. అక్బర్ ఎప్పటిలాగే బీర్బల్ ని ప్రశంసించి వేటను కొనసాగించారు.
    ఈ సందర్భానికి కొద్దిగా మార్పులు చేసి కొన్ని సినిమాలలో కూడా వాడారు. 

గమనించము కానీ
గాఢమైన నిద్రనుండి మేల్కొన్నపుడు కూడా
మనచుట్టూ ఉన్న ప్రపంచం అప్పుడే పుట్టినట్లుంటుంది
ఆ క్షణమే ఎవరో ప్రపంచాన్ని తెచ్చి పరిచినట్లుంటుంది
అప్పుడు, తాజాగాలులు మొదటి శ్వాసలా దేహంనిండా వ్యాపిస్తాయి

గమనించము కానీ
దీర్ఘ ప్రవాసం తరువాత ఇల్లు చేరినపుడు
ఇల్లు కూడా కాసేపు మానని అతిథిలా చూస్తుంది
ఇంటిగోడలూ, వెలిసిన రంగులూ, ఇంటిలోని వస్తువులూ
ఇవాళ వాకిట్లో పూసిన పూలూ, మన మనుషుల మాటలూ
ఎవరీ మనిషని చూస్తున్నట్లూ, ఎవరినో పలకరిస్తున్నట్లూ ఉంటాయి

గమనించము కానీ
ఇల్లూ, మెలకువా పాతబడే కొద్దీ
నెమ్మదిగా మనవాళ్లూ, ప్రపంచమూ మనలో నిండే కొద్దీ
దేనినో కోల్పోతున్న దిగులొకటి
ఇసుకపొరలు దాటుకొంటూ వాననీరు పాతాళంలోకి ఇంకుతున్నట్లు
మనలోకి ఇంకుతూ ఉంటుంది!

రచన: బివివి ప్రసాద్ 
రంగులెపుడు తొలిసారి పరిచయమయ్యాయో జ్ఞాపకముందా?
బొమ్మలపైనా, అమ్మ చీరలపైనా, పూలపైనా, మేఘాలపైనా
రంగులెలా తొలిసారి ఆశ్చర్యపరిచాయో స్మృతులు మిగిలాయా?

పసుపూ, ఎరుపూ, నీలం, తెలుపూ, నలుపుల వేల ఆటలు
పేర్లతో అలవాటుపడక ముందు ఏ రహస్యలోకాల సందడి చేశాయో గుర్తుందా?

ఇంకా అపుడపుడూ విస్మయపరుస్తాయి రంగులు నన్ను
వ్యాకులతలూ, భయాలూ చీకటిలా ముసిరినపుడు బాల్యస్నేహితుల్లా సేదదీరుతాయి
ముకుళించటం మృత్యువు, వికసించటం జీవితమని వెన్నుతడతాయి

దైవానికి దయలేదనీ, ఆయనకు మాటలు రావనీ ఎవరైనా అన్నప్పుడల్లా
వెలుతురూ ఆయన దయ అనీ, రంగులు ప్రేమభాషణ అనీ చెప్పాలనిపిస్తుంది

రంగులు వెలిసిపోవటం ఎపుడు మొదలయిందో వెనుదిరిగి చూసావా?
చిన్ననాటి పుస్తకాలతో పాటు దాచుకున్న నెమలీకనీ జీవితంలోంచి విసిరేసిన క్షణాలలో
మనలోంచి మాయమైన అమాయకత్వాన్ని ఎప్పుడైనా తడుముకున్నావా?

తెల్లని కాంతీ, కాంతి నుండి ఎగిరే రంగులపక్షులూ ఎటు వెళ్లిపోయాయో,
కాంక్షలమేఘాలతో జీవితమెలా మాసిపోయిందో ఎపుడైనా బాల్యాన్నడిగి తెలుసుకున్నావా? 
రచన: బివివి ప్రసాద్

చిన్నప్పుడు పారదర్శకమైన గాజుగోళీలో రంగురంగుల ప్రపంచాలని చూసినపుడు
గోళీలోకి వెళ్ళిపోయి ఆ రంగుల్ని తాకితే బావుండనిపించేది

ఎటునుంచీ లోనికి వెళ్లే వీలులేని
నున్నని గాజువలయం మీదినుండి నా కల జారిపోతూ ఉండేది

గోళీలో రంగులూ, గోళీ వెలుపల నేనూ
మా మధ్యన స్వచ్ఛమైన దిగులుతో మెరిసే క్షణాలూ

ఒక గుర్తులేని ఉదయం
గోళీలు నా బాల్యాన్ని వెంటబెట్టుకొని
చిరునామా తెలియని లోకాలకి వలస వెళ్లిపోయాయి

పర్వతాల్లా, మహావృక్షాల్లా కనిపించే
పెద్దవాళ్లలో ఒకడినైపోవాలనే కల ఒకటీ
కాలం తన ఒడిలో కుర్చోబెట్టుకొని నిజం చేసి చూపించింది

వెనుదిరిగి చూసుకొంటే
బాల్యాన్ని కోల్పోవటమే ఉంటుంది కానీ
పెద్దవాళ్ళం కావటం ఉండదని అర్థమయింది!

ఊహల మంత్రదండం తలపై తాకించుకుని
బాల్యంలో నిలబడి ప్రపంచాన్ని పరికించాను ఒకసారి

విశ్వం ఒక గాజుగోళీ!
పారదర్శకమైన గాజుశూన్యంలో చలించే రంగుల ప్రపంచం ఇది!
వలసవెళ్లిన బాల్యం తిరిగివచ్చి నన్నొక గాజుగోళీ లోపల నిలబెట్టింది!

ఇప్పుడు ఎటునుంచీ బయటికి వెళ్లే వీలులేని
నున్నని గాజువలయం అవతల ఏముందో తెలుసుకోవాలనిపిస్తుంది!

రచన: బివివి ప్రసాద్

నీలో కొన్నిసార్లు ఉత్సవముంటుంది!
అప్పుడు నీకందర్నీ పలకరించాలనిపిస్తుంది
పూలతో, పిట్టలతో,దారినపోయే మనుషులతో తోచిన మాటలన్నీ మాట్లాడాలనిపిస్తుంది
దుఃఖంచే నేత్రాలపై మృదువుగా ముద్దులు పెట్టాలనిపిస్తుంది
ఎవరేమనుకుంటే ఏమిటని వచ్చీరాని పాటలన్నీ పాడాలనిపిస్తుంది
దేహాన్నోక కెరటం చేసి నర్తించాలనీ,
నలుగురు పిల్లల్ని పోగుచేసి పరుగుపందెంలో వాళ్ళతో ఓడిపోవాలనీ అనిపిస్తుంది

నీలో కొన్నిసార్లు నిరాశ ఉంటుంది!
అప్పుడు ప్రకాశిస్తున్న ఎండలోకి ఎవరో చీకటిని ఓంపుతున్నట్లుంటుంది
కనిపించని తలుపులన్నీ మూసుకుంటూ లోలోపలికి వెళ్లిపోవాలనిపిస్తుంది
గండశిలవంటి కాలాన్ని పగులగొట్టి దిగంతాలకు విసిరివేయాలనిపిస్తుంది
తెలియని ఉప్పెన ఎదో నలువైపుల నుండీ ముంచేస్తున్నట్లుంటుంది
విసుగువేరు తొలుచుకుంటూ వెళ్లి నిన్ను పూర్తిగా ఖాళీ చేసుకోవాలనిపిస్తుంది

నీలో కొన్నిసార్లు కోరికల సమూహాలుంటాయి!
నీ ఇంద్రియాలు వికసించి లోకాన్నొక దాహకమై కమ్మేయాలనిపిస్తుంది
చూసినవన్నీ కోరక ముందే సొంతం అయిపోవాలనిపిస్తుంది
ప్రపంచం నీ ముందు మోకరిల్లి నిన్ను కీర్తించాలనిపిస్తుంది
మృత్యువుకే నిన్ను చూస్తే భయం వేయాలనిపిస్తుంది

నీలో కొన్నిసార్లు భయముంటుంది!
రాత్రి వచ్చిన కల చివర ఊహకందని శక్తి ఏదో ఎత్తుకుపోయినట్లుంటుంది
నిన్ను నొక్కిపెడుతున్న ఎవరినో శక్తికొద్దీ విసిరేయాలనిపిస్తుంది
రానీ, చూసుకుందామనే మొండిధైర్యంలోకి పూర్తిగా దూకేయాలనిపిస్తుంది. 
ప్రపంచాన్ని కూర్చోబెట్టి గబగబా పాఠాలు చెప్పేయాలనిపిస్తుంది

నీలో కొన్నిసార్లు నిష్కపటమైన దయ ఉంటుంది!
గాయపడ్డ ప్రాణాలన్నిటినీ దగ్గరగా హత్తుకోవాలనిపిస్తుంది
లోకం చేసిన గాయాలన్నీ పోనీలే అని మరిచిపోవాలనిపిస్తుంది
ప్రపంచాన్ని పసిబిడ్డను చేసి ఎత్తుకోవాలనిపిస్తుంది
అప్పుడు నీకు జీవితం మీద  జీవితమంత ప్రేమ పుడుతుంది

నీలో కొన్నిసార్లు అరుదుగా మౌనం ఉంటుంది!
ప్రపంచాన్ని చూసి ఒకే ఒక్క పసినవ్వు నవ్వాలనిపిస్తుంది
రాలినపూవు నేలని తాకిన చప్పుడు నీలో కోమలంగా కరిగిపోయినట్లుంటుంది
సూర్యోదయాన్ని దోసిలిలో ఒంపుకుని సుతారంగా త్రాగినట్లుంటుంది
ఆకాశం పక్షిరెక్కయి శాంతిలోకి ఎగురుతున్నట్లుంటుంది
అప్పుడు, ఒకసారి జీవితాన్ని నిజంగా జీవిస్తున్నట్లుంటుంది


రచన: బివివి ప్రసాద్