నువ్వు లోకాన్ని లోపలి తీసుకుంటున్నపుడు
అది నిన్నూ లోపలికి తీసుకుంటుంది
నిశ్చలతటంలోకి దిగినట్టు లోకంలోకి దిగుతావు కానీ
నీటి అడుగున వేచిఉన్న మొసళ్ళని ఊహించలేవు
ప్రతి గెలుపూ, పరాజయమూ
జీవనానందం నుండి మరికాస్త దూరం చెయ్యటానికి వస్తాయి
కీర్తి ఒక వజ్రంలా ఆకర్షిస్తుంది కానీ
దానిని మ్రింగినపుడు ప్రాణం తీయటం మొదలుపెడుతుంది
జీవితం ఇటువంటిదని ఎవరూ చెప్పరు
జీవితం కానిది వదులుకొంటే జీవితమే మిగులుతుంది
వెళ్లిపొమ్మని నిన్ను ఊపేస్తున్న భావాలన్నీ
జీవితపు నీడలే కానీ, జీవితం కాదు
జీవితం తనని తాను చూసుకొనేందుకు
నిన్ను కన్నది కానీ, నువ్వేదో చేసి తీరాలని కాదు
ఏదో చెయ్యటానికే అన్నీ ఉండాలనుకుంటే
ఏదీ చెయ్యని ఆకాశం ఏనాడో మాయమైపోయేది
జీవించడం అంటే మరేం కాదు
గాలిలా, నేలలా, నీటిలా ఊరికే ఉండడం
ఉండడమే ఉత్సవమైనట్టు ఉండడం
మిగిలిన పనులన్నీ నిద్రపోయాక నీ ప్రక్కలో ఒంటరైన ఆటబొమ్మలు
రచన: బివివి ప్రసాద్

0 comments: