Images Source: GOOGLE | Any copyright violations are completely unintentional. Credits given to the concerned person/organization wherever possible. Let us know any such voilation/using without credit. Thanks!

దేశ భాషలందు తెలుగు లెస్స!

Crafted with on Telugu by Kathala Express teamⒸ2017
   
   పూర్వం పల్లవ రాజ్యాన్ని పవిత్ర వర్మ అనే రాజు పాలించేవాడు. అతడికి లేకలేక ఒక కుమారుడు కలిగాడు. అతని భార్య భామతి బిడ్డను అపురూపంగా చూసుకునేది. ఆ బిడ్డకు అపూర్వ వర్మ అనే పేరు పెట్టుకున్నారు దంపతులు. అపూర్వ వర్మకు ఐదేళ్ళు నిండుతుండగా అతడిని తమ కులగురువైన జ్ఞానానందుని గురుకులంలో విద్యాభ్యాసం కోసం చేరాాలని నిర్ణయించుకున్నాడు పవిత్రవర్మ. ఆ మరునాడే శుభదినమని గురువు చెప్పాక మహారాణికి విషయం చెప్పాడు పవిత్రవర్మ.

  వెంటనే మహారాణి భామతి, "మహారాజా! కుమారుని గురుకులానికి పంపేబదులుగా గురువుగారినే అంతః పురానికి పిలిపించి విద్యాభ్యాసం చేయించవచ్చు కదా! కుమారుని వదిలి నేను జీవించలేను మహారాజా!" అనింది. "మహారాణీ! మన సాంప్రదాయం ప్రకారం గురుకులంలోనే ఇతర విద్యార్థులతో కలిసి జీవిస్తూ విద్యాభ్యాసం చేయాలి. దాన్ని మార్చడం శ్రేయస్కరం కాదు. కుమారుని భవిత గురించి ఆలోచించి మీరు కుమారుని వదలి కొంతకాలం జీవించకతప్పదు. రాజ్యోచిత విద్యలన్నీ ఆశ్రమంలో నేర్పడం ఆనవాయితీ" అని బదులిచ్చాడు. ఆరాత్రి అపూర్వ వర్మకు అన్నం తినిపిస్తూ భామతి "ఈ కాస్తా తిను కుమారా! బంగారం కదూ!" అంటూ బ్రతిమాలడం చూసిన పవిత్ర వర్మ 'ఇంతగారాబం చేయడం కుమారునికి మంచిదికాదు’ అని భావించాడు. మహారాణి కుమారునితో "కుమారా! ఆశ్రమంలో నీకు ఆకలైతే గురుపత్నికి విన్నవించు. ఆకలితో ఉండకు కుమారా!" అనిచెప్పగా, దానికి అపూర్వ వర్మ "ఆకలంటే ఏమిటి మాతా!" అని అడిగాడు. అది విని మహరాజు మనసులో ఒక నిర్ణయానికి వచ్చాడు. మరుదినం అపూర్వ వర్మ ను తీసుకుని గురుకులానికి బయలుదేరాడు పవిత్ర వర్మ. కుమారుని గురువుకు అప్పగించి, అతడికి ఏదో రహస్యంగా విన్నవించుకుని వచ్చాడు.

   గురుకులంలో అందరితో పాటుగా అపూర్వ వర్మ కూడా వేకువనే లేచి గంగా స్నానం ఆచరించి, యోగవిద్యలు గురువు చేస్తుండగా అనుసరించి, పక్కనే ఉన్న అడవినుంచి పూలూ, ఫలాలూ సేకరించి తెచ్చాక, గురుపత్ని అందించే గోక్షీరం , పండ్లు సేవించి, మధ్యాహ్నం వరకూ విద్యాభ్యాసం చేయాల్సి వచ్చేది. ఏదో తెలీని బాధ అతడి కడుపులో కలగ సాగింది. ఒక మధ్యాహ్నం అతడు పొట్టపట్టుకుని బాధ పడుతుండగా చూసిన తోటివిద్యార్థులు వెళ్లి గురువు గారిని పిలుచుకువచ్చారు. గురువు జ్ఞానానందులు వచ్చి అపూర్వని పరీక్షించి, చిరునవ్వుతో, "కుమారా! ఇదే ఆకలంటే ! ఆకలైనపుడు కడుపులో ఇలాంటి బాధ కలుగుతుంది. దేశంలో ఎందరో పేదలు ఈ ఆకలి తీర్చుకోడానికి అనేక కష్టాలు పడుతుంటారు. చేద్దామన్నా తగినపని దొరకక, లభ్యమైనది చేయలేక ఇబ్బంది పడుతుంటారు నాయనా! ప్రజల పేదరికాన్ని పోగొట్టి వారి ఆకలితీరడానికి  తగిన చర్యలు చేపట్టి, వారిని ఆదుకోవడం రాజు కర్తవ్యం."అని చెప్పి అతడి ఆకలి తీర్చాడు. అలా ప్రతి విషయం చలి, ఎండ, వానల నుంచి రక్షణ, నివాసం, నీటి అవసరం, శరీరానికి వస్త్రాలు మొదలైనవన్నీ అనుభవపూర్వకంగా నేర్పారు. యుద్ధవిద్యలతో పాటుగా, యుద్ధనీతి, రాజనీతి, రాజు విధులు, కర్తవ్యం కూడా నూరిపోశారు గురువుగారు.

     యువరాజు సుశిక్షితుడైన పాలకునిగా తయారయ్యాక అతడిని రాజభవనానికి పంపారు జ్ఞానానందులు. యువరాజు అపూర్వునికి తండ్రి పవిత్ర వర్మ తనకు వయస్సు పైబడటంతో రాజ్యాభిషేకం చేశాడు. అపూర్వుడు ప్రజల అవసరాలు తీర్చడానికి తగిన పనులు కల్పించి వారికి వారే తమకు కావల్సిన ధనం సంపాదించుకునే లాగా తీర్చిదిద్దాడు. గొప్ప పాలకుడని పేరుపొందాడు.

0 comments: