Images Source: GOOGLE | Any copyright violations are completely unintentional. Credits given to the concerned person/organization wherever possible. Let us know any such voilation/using without credit. Thanks!

దేశ భాషలందు తెలుగు లెస్స!

Crafted with on Telugu by Kathala Express teamⒸ2017
 
     ఆగస్ట్ 15వ తేదీ రావడానికి రెండు రోజులు మాత్రమే వుంది. స్కూల్ లో విద్యార్థినీవిద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ హడావుడిగా రిహార్సల్స్ చేస్తూ ఉన్నారు. సాయంకాలం 4.30 గంటలకు మీటింగ్ మొదలైంది. మీటింగ్ లో హెడ్ మాస్టర్ గారు "ఈ సంవత్సరం ఆగస్ట్ 15కు చాలా విశేషముంది. అన్నివిధాల కార్యక్రమాలు క్రమశిక్షణతోనూ, శ్రద్ధాభక్తులతోనూ అందరినీ అలరించే విధంగా వుండాలి. కష్టపడి మన పాఠశాలకు బంగారు నంది అవార్డును గెలుచుకోవాలి" అన్నారు. సమయం లేనందువల్ల మిగిలిన ఉపాధ్యాయులు అదే టాపిక్ పైన విద్యార్థులందరికీ సలహాలు ఇచ్చారు. అయితే ఈ మహోన్నతమైన కార్యక్రమానికి ముఖ్య అతిథులు - సంస్కారవంతులు, సినిమాలకు దర్శకత్వం చేయడంలో మహామహులు అయినటువంటి దర్శకరత్న దాసరి నారాయణరావుగారు, డా. కె. విశ్వనాథ్ గారు వస్తున్న విషయాన్ని గుప్తంగా ఉంచారు.

     ఆ పాఠశాలలోనే అవిటితనంతో ఉన్న పసిపిల్లలు సుందరం, సుజాత, శీనులకు కూడా ఆ ప్రోగ్రాములో పాల్గొనాలని ఆశ వుంది. అయితే అవకాశము లేదు. ముగ్గురు ధైర్యం చేసి హెడ్ మాస్టర్ గారి దగ్గరకు వెళ్ళి "సార్, మాకూ ఒక ఛాన్స్ ఇవ్వండి" అంటూ ప్రాధేయపడ్డారు. అందుకు హెడ్ మాస్టర్ "అవిటివారు, మీరేమి చేస్తారు?" అని హేళన చేస్తూ, "చివరన 5 నిముషాల కాలం మీకు కేటాయిస్తాను" అని అన్నారు. అంతే ముగ్గురూ అవిటివారు కావడం వలన  ఒకరినొకరు చేయి-చేయి పట్టుకుని గంతులేసుకుంటూ పూరి గుడిసెను చేరుకున్నారు.

     ఇంక 24 గంటలు మాత్రమే టైమ్ ఉంది. టాపిక్ తెలియదు. గైడ్స్ ఎవరూ లేరు, డబ్బు లేదు. రాత్రి 7 గంటల సమయం. వెన్నెల కాలం కావడంవల్ల ముగ్గురూ ఆరుబయటకి వచ్చారు. చిన్నది సుజాత.. "శీనూ.. ఆగస్ట్ పండుగ అంటే జెండాల పండుగ కదా ! మనము జెండాపైనే  నాటకం ఆడుదాం" అన్నది. ఉపాయం బాగుంది అని ముగ్గురు ప్లాన్ చేసి నిద్రపోయారు.

  స్వాతంత్రదినం వచ్చేసింది. ప్రోగ్రాం శుక్లామ్ భరధరం తో మొదలైంది. పెద్ద పెద్ద వేషాలతోనూ, కూచిపూడి, భరతనాట్యం ఇలా రకరకాల డ్రామాలు వేస్తున్నారు. కార్యక్రమం గలగల శబ్దములతో నడుస్తూ ఉంది. ఇంకా సుందరం, శీను, సుజాతల పేర్లు పిలవలేదు. రద్దీగా ఉండడం వల్లనో, అవిటివారు కావడం వల్లనో పిల్లలు బిక్కుబిక్కుమంటూ అవకాశం కోసం ఆత్రంగా చూస్తూఉన్నారు. ఇంతలో మైక్ నుండి ముగ్గురి  పేర్లు పిలవవడంతో గెంతులేసుకుంటూ, "దూడ ఆవు దగ్గర పాలు త్రాగడానికి వెళ్ళినట్టు" కన్ను మూసి తెరిచేంతలో స్టేజి మీదకు చేరుకున్నారు.

  "గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర" అన్న శ్లోకంతో ప్రారంభించారు. ఒక నిమిషం ఆ ప్రాంతం అంతా నిశ్శబ్దం చోటు చేసుకుంది. చిన్నది సుజాత, బ్లాక్ బోర్డు మీద చాక్ పీస్ తో అందమైన జెండాను రెండు నిమిషాలలో గీసేసింది. సుందరం, 1947 ఆగస్ట్ 15 న గాంధీ తాత మనకు స్వాతంత్య్రం  తెచ్చిపెట్టారు. మనమిప్పుడు పీలుస్తున్న ఈ గాలి, ఈ వెలుతురు, నీరు అన్నీ మనవే. మనం ఇప్పుడు ఎవరికి బానిసలం కాము అని టక టకా చెప్పేసాడు. అందరికీ ఆతృత, ఉత్సుకత పెరిగంది. ఇక శీను గాడు స్టేజి పైకి వచ్చిరావడంతోనే మైక్ అందుకున్నాడు. ముగ్గురు ఒకరినొకరు చేయి -చేయి పట్టుకొని ఏకధాటిగా ఒక పాటని అందుకున్నారు.

తెలుగోని ధనం, తెలుగుదనం
అదే తెలుగోనిఆభరణం,
మంచితనం, మానవత్వం
సమానత్వం, అహింసా తత్వం,
అదే తెలుగోని "ఆయుధం".
తెల్ల దొరల పొగరణచిన దినం
ఆ దినం, స్వాతంత్య్ర దినం
ఆ క్షణం, తెలుగోని మధుర క్షణం
ఆ దినం, మనకు మరువలేని దినం
అదే తెలుగోని సంబరం!
                      అని పాడి సభికులకు నమస్కారం చేసారు.

  మహానటుడు, దర్శకరత్నదాసరిగారు ఒక్క పరుగున పిల్లల దగ్గరికి వచ్చి ముగ్గురిని హృదయానికి హత్తుకున్నారు. కళ్ళనీళ్ళను కండువాతో తుడుచుకుంటూ, సంతోషంతోను, దుఃఖంతోనూ డా. కె. విశ్వనాధ్ గారు దగ్గరికి వచ్చి తన భుజంపైనున్న శాలువాని పిల్లలకు కప్పారు. "దాసరి! ఆ బంగారు నంది అందుకో.." అని చెప్పి బంగారు నంది అవార్డును పిల్లలకు అందజేసారు. అందరికి నోటమాట  రాక ముక్కు  మీద వేలు వేసుకున్నారు. "సార్.. ఒక్క నిమిషం మాకు టైమ్ ఇస్తారా, ఒకే ఒక్క ముక్క మాట్లాడి మేము వెళ్తాము" అని ముగ్గురు పిల్లలు అడిగారు. అందుకు దాసరిగారు, సరే అన్నారు.

     "అవిటితనం అనేది మనిషికున్న అవయవాలకు గానీ మనసుకు కాదు. ఐకమత్యమే మహాబలం అని గాంధీ చెప్పాడు. అందుకే ఆయన అడుగుజాడలలోనే మేము నడుస్తాము" అని సంబరంతో గెంతులేసుకుంటూ కిందకి వచ్చి యథావిధిగా పూరిగుడిసె చెరుకున్నారు. సుందరం, సుజాత, శీనులను చూసి హెడ్ మాస్టర్ తలదించుకున్నాడు.

సందేశం: పసిబిడ్డల మధ్య తారతమ్యాలను చూపించి, పసిబిడ్డల మనసులను సమాధి చేయకండి. అవిటి వారిని అవహేళన చేయకండి.
---story from the book wrote by యమ్మమూరు విజయశ్రీ 

     

0 comments: