ఆ చల్లటి సాయంకాలం, అందంగా ఆనందముగా సీత ఆనంద భైరవీ రాగాన్ని రవీంద్రభారతి స్టేడియంలో ఆలపిస్తూ వుంది. దానికి అనుగుణంగా శ్యామ్ వీణావాద్యం చేస్తూ వున్నాడు. ఈ సంగీత కార్యక్రమాన్ని సభికులు తన్మయత్వంతో వీనుల విందు చేసుకొంటున్నారు. అంతలో హఠాత్తుగా సీతకు ఫిట్స్ రావడంతో స్పృహ తప్పి కింద పడిపోయింది. ఆ క్షణం శ్యామ్ పక్కనే ఉన్న బాటిల్లో నీరు తీసి సీత మీద చల్లి, సీత తలను తన తొడపైన పెట్టుకుని తన కండువాతో విసరనారంభించాడు. ఒక్కసారిగా ప్రేక్షకుల మొహాలు వెలవెల పోయాయి. దాంతో సభ్ చిన్నబోయింది. వెంటనే సీత భర్త రామ్ పరుగున వచ్చి సీతను భుజాన వేసుకొని తన ఆప్తమిత్రుడు అయిన శ్యామ్ సాయంతో సీతను కారు దగ్గరకి తీసుకెళ్ళి కారులో శ్యామ్ డ్రైవు చేయగా ఇళ్లు చేరుకున్నారు.
మరుదినం సీత కాస్తంత కుదుట పడడంతో సీతతో సహా రామ్, శ్యామ్ లు పార్కుకు వాకింగ్ చేయడానికి బయలుదేరారు. పోతూ పోతూ వుండగా కొంతమంది అమ్మలక్కలు వారిని అదోలా చూడడం జరిగింది. దాని భావమేమని ముగ్గురికి అంతుబట్టలేదు. వైద్యుడు సీతకు కొంచెము విశ్రాంతి అవసరం అని చెప్పడంతో సీత పాడడం మానేసింది. అయినప్పటికీ, శ్యామ్ యథావిధిగా రామ్ ఇంటిలో వున్నా, ఆఫీసులో ఉన్నా వస్తూ పోతూ సీతను పరామర్సించేవాడు. నిష్కల్మషమైన స్నేహబంధం రామ్ - శ్యామ్ లది. అందువల్ల శ్యామ్ ఎన్నిసార్లు ఇంటికి వచ్చి పోయినా రామ్ ఏమీ అనుకునేవాడు కాదు.
వారం దినాలు గడిచింది. శ్యామ్ వస్తూ పోతూ ఉండడంతో సమాజం దృష్టి సీతా,శ్యామ్ ల వైపు మళ్ళింది. అంతే, చుట్టుపక్కలవాళ్ళ నుండి గుసగుసలు ప్రారంభమయ్యాయి. ఒక దినం సీత-రామ్ లు సినిమా చూడడానికి వెళ్లారు. ఇంటర్వెల్ టైమ్ లో అనుకోకుండా వారికి చుక్కెదురైంది. అందరూ సీత సభలో పడిపోయినప్పుడు, శ్యామ్ మానవతవంతో సీతను చేరదీసిన తీరును వ్యంగంగా మాట్లాడుకోవడం జరిగింది. సినిమా అర్థంలోనే, ఆ మాటలను వినలేక భార్యాభర్తలు ఇంటికి తిరిగి వెళ్లారు.
సీత నిద్రపోయింది. అయితే రామ్ కి నిద్దర పట్టట్లేదు. బయట లాన్ లో పచార్లు చేస్తూ, సీత సభలో పడిపోవడం, శ్యామ్ సీత తలను తొడపైన పెట్టుకుని నీరు చల్లడం వగైరా దృశ్యాన్ని పదే పదే ఆలోచిస్తూ, సినిమాలో హాలులో విన్న మాటలను బేరీజు వేసుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. మెదడులో అనుమానం మొదలంది. అంతే రామ్ తన పక్కను రూమ్ నుండి వరండాకు మార్చేసాడు. నిద్ర లేచిన సీత పక్కన భర్త లేకపోవడంతో గాభరా పడి, అటు ఇటు చూసి భర్త
వరండాలో వుండడం చూసి, తన పనిలో తాను లీనమైపోయింది. రామ్ తప్పుగా ఆలోచించడం వల్ల బుర్ర వేడెక్కి, చొక్కా వేసుకొని హడావుడిగా బయటకు వెళ్ళిపోయాడు.
అంతే, రెండు రోజులు అయినా రామ్ ఇంటికి రాలేదు. విషయం ఏమని తెలుసుకుని సీత నిర్ఘాంతపోయింది. శ్యామ్ మానవత్వం తో చేసిన సేవను అపార్థం చేసుకున్న రామ్ పై సీతకు అసహ్యం వేసింది. ప్రేమించిన రామ్ తన ప్రేమను శంకించడం భరించలేక, రామ్ తనతో ఇక ఉండడని ఊహించిన సీత నిద్రమాత్రలు మింగి రామ్ కి చిన్న ఉత్తరం ముక్క రాసి చనిపోయింది. శ్యామ్ తన స్నేహితుడు తన స్నేహాన్ని శంకించాడన్న నిజాన్ని భరించలేక, తను సీత-రామ్ ల జీవితానికి అడ్డుగోడ కాకూడదని చిన్న ఉత్తరం రాసి టేబుల్ పైన ఉంచి ఆత్మహత్య చేసుకున్నాడు. ఊరంతా ఈ వార్త పొక్కిపోయింది. ఈ వార్త విని రామ్ పరుగుపరుగున ఇంటికి వచ్చాడు.
రామ్ రావడం ఆలస్యం కావడం వలన జనం మధ్యలో సీత చేతిలోని ఉత్తరం రామ్ కంటపడింది. అందులో "నన్ను క్షమించండి, నాదేమీ తప్పు లేదు, నా చావుకు ఎవ్వరూ బాధ్యులు కారు" అని మూడు వాక్యాలు రాసి ఉంది. రామ్ ఏడుస్తూ, పక్కన ఉన్న రూమ్ కి పోయి శ్యామ్ కు క్షమాపణ చెపుదామని వెళ్లగా శ్యామ్ రాసిన ఉత్తరం టేబుల్ పైన ఉండడం చూసి దాన్ని రామ్ తెరిచి చూసాడు. అందులో "రామ్, నన్ను క్షమించు, నాదేమీ తప్పు లేదు, నా చావుకు ఎవరూ బాధ్యులు కారు" అని రాసి వుండడం చూసి రామ్ నిర్ఘాంతపోయాడు.
సందేశం: అనుమానం పెనుభూతం రామ్ అనుమానించి అటు ప్రేమించిన భార్యను, ఇటు చిన్ననాటి స్నేహితుణ్ణి పోగొట్టుకున్నాడు.
భార్యాభర్తల మధ్య నమ్మకం ఉండడం చాలా ముఖ్యం. నమ్మకంతో ఉన్న ఆలూమగల సంసారం ఒకరితో ఒకరు మల్లెతీగలా అల్లుకుపోవడానికి అవకాశం ఉంటుంది. అపనమ్మకంతో జరిపే సంసారం ఏదో ఒకనాడు పేక మేడలా కూలిపోవడం అనేది నగ్నసత్యం.
---story from the book wrote by యమ్మమూరు విజయశ్రీ
0 comments: